బ్రిటిష్ మోడల్, భారతీయ నటి అయిన అమీ జాక్సన్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ అందాల తార తమిళం, హిందీ, తెలుగు భాషల్లో ఎన్నో పాపులర్ సినిమాల్లో నటించి, దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఆమె మొదట తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, విక్రంతో కలిసి నటించిన “ఐ” సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యింది.
అలాగే, రజనీకాంత్ సరసన “రోబో 2.0” లో నటించడం ఆమెకు మంచి క్రేజ్ తెచ్చింది. తెలుగు ప్రేక్షకులకు “ఎవడు” సినిమాలో రామ్ చరణ్‌తో జతకట్టిన ఈ అందాల భామ, తమిళంలో ధనుష్‌తో “నవవసంతం,” విజయ్‌తో “తేరి” వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. ఆమె బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది.
సినీ కెరీర్ ను కొన్ని సంవత్సరాలు కొనసాగించిన తర్వాత ఆమె తన వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెట్టింది. కొంత కాలం బ్రిటిష్ వ్యాపారవేత్త జార్జ్ పనాయోటౌతో డేటింగ్ చేసి, పెళ్లి చేసుకుని, ఆండ్రియాస్ అనే కొడుకు పుట్టిన తర్వాత ఆ బంధానికి ముగింపు పలికింది.
అతని తర్వాత ఈ ఏడాది ఆరంభంలో పాపులర్ హాలీవుడ్ నటుడు ఎడ్వర్డ్ జాక్ పీటర్ వెస్ట్‌విక్ తో ప్రేమలో పడ్డ ఆమె, జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆగస్టులో ఇటలీలో పెళ్లి చేసుకుంది. తాజాగా, ఆమె తన ప్రెగ్నెన్సీ వార్తను బయటపెట్టడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. పెళ్లయిన రెండు నెలలకే బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె ప్రస్తుతం తన ఐదేళ్ల కొడుకు ఆండ్రియాస్‌ను ప్రేమతో పెంచుకుంటూ, కొత్త జీవితంలో మరో బిడ్డకు జన్మనివ్వబోతుంది.